క్రైస్తవం
వెనక్కి

1 రాజులు 3

1తరువాత సొలొమోను వివాహం ద్వారా ఐగుప్తు రాజు ఫరోతో సంధి కుదుర్చుకున్నాడు. అతడు తన అంతఃపురాన్నీ యెహోవా మందిరాన్నీ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్నీ కట్టించడం అయ్యే దాకా ఫరో కూతురిని దావీదు పురంలో ఉంచాడు.

2అప్పటి వరకూ యెహోవా పేరట కట్టిన మందిరం లేనందువలన ప్రజలు ఉన్నత స్థలాల్లో మాత్రమే బలులు అర్పిస్తూ వచ్చారు.

3సొలొమోను తన తండ్రి దావీదు నియమించిన శాసనాలు అనుసరిస్తూ యెహోవా దేవుణ్ణి ప్రేమించాడు గాని ఉన్నత స్థలాల్లో మాత్రం ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నాడు.

4ఉన్నత స్థలాల్లో గిబియోను ముఖ్యమైనది కాబట్టి రాజు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.

5గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు.

6సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు “నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి, ఈ రోజు ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని పై గొప్ప అనుగ్రహం చూపించావు.

7నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు.

8నీ దాసుడినైన నేను నీవు ఎన్నుకొన్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం.

9నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.”

10సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమైంది.

11కాబట్టి దేవుడు అతనితో “దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు.

12నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వికుల్లో నీవంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట ఉండడు.

13ఇంకో విషయం, నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని అడక్కపోయినా నేను వాటిని కూడా నీకిస్తున్నాను. కాబట్టి నీ జీవిత కాలం అంతటిలో రాజుల్లో నీలాంటివాడు ఒక్కడైనా ఉండడు.

14నీ తండ్రి దావీదు నా మార్గాల్లో నడిచి, నా కట్టడలనూ నా ఆజ్ఞలనూ నెరవేర్చినట్టు నీవు కూడా నడుచుకుంటే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను” అన్నాడు.

15అంతలో సొలొమోను మేలుకుని అది కల అని గ్రహించాడు. తరవాత అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన ఉన్న మందసం ఎదుట నిలబడి దహనబలులూ సమాధానబలులూ అర్పించి తన సేవకులందరికి విందు చేయించాడు.

16ఆ తరవాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకి వచ్చి అతని ఎదుట నిలబడ్డారు.

17వారిలో ఒక స్త్రీ ఇలా వేడుకుంది “నా యజమానీ, నేనూ ఈమె ఒకే ఇంట్లో నివసిస్తున్నాం. ఆమెతో బాటు అదే ఇంట్లో నేనొక కొడుకుని కన్నాను.

18నేను కనిన తరవాత మూడో రోజు ఈమె కూడా ఒక కొడుకుని కన్నది. మేమిద్దరమూ కలిసే ఉన్నాం. మేము తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు.

19అయితే రాత్రి ఈమె పడకలో తన పిల్లవాడి మీద పడడం వలన ఆమె కొడుకు చనిపోయాడు.

20కాబట్టి మధ్య రాత్రిలో ఈమె లేచి నీ దాసినైన నేను నిద్రపోతుండగా నా పక్కలో నుండి నా కొడుకుని తీసుకుని తన పక్కలో పెట్టుకుని, చచ్చిన తన పిల్లవాణ్ణి నా పక్కలో ఉంచింది.

21ఉదయం నేను లేచి నా పిల్లవాడికి పాలివ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు. తరవాత నేను వాడిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వాడు నా కడుపున పుట్టినవాడు కాడని గ్రహించాను.”

22అంతలో రెండో స్త్రీ “అలా కాదు, బతికి ఉన్నవాడు నా కొడుకు. చచ్చినవాడు ఆమె కొడుకు” అని చెప్పింది. అప్పుడా మొదటి స్త్రీ “కాదు, చచ్చిన వాడే నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు” అంది. ఈ విధంగా వారు రాజు ఎదుట వాదించుకున్నారు.

23అప్పుడు రాజు “బతికి ఉన్నవాడు నా కొడుకు, చనిపోయిన వాడు నీ కొడుకు అని ఒకామె, కాదు, కాదు చనిపోయిన వాడు నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు అని రెండవ ఆమె చెబుతున్నది.

24కాబట్టి ఒక కత్తి తీసుకు రండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. వారు రాజు దగ్గరికి ఒక కత్తి తెచ్చారు.

25రాజు “బతికి ఉన్న పిల్లవాణ్ణి రెండు ముక్కలు చేసి సగం ఈమెకూ, సగం ఆమెకూ ఇయ్యండి” అని ఆజ్ఞాపించాడు.

26ఆ మాటలకు ఆ పిల్లవాడి తల్లి తన బిడ్డ విషయం పేగులు తరుక్కుపోయి, రాజుతో “రాజా, పిల్లవాణ్ణి ఎంతమాత్రం చంపవద్దు, వాణ్ణి ఆమెకే ఇప్పించండి” అని వేడుకుంది. ఆ రెండవ స్త్రీ “ఆ పిల్లవాడు నాకైనా ఆమెకైనా కాకుండా చెరి సగం చేయండి” అంది.

27అందుకు రాజు “బతికి ఉన్న ఆ బిడ్డను చంపవద్దు. వాడిని ఆ మొదటి స్త్రీకి ఇవ్వండి. ఆమే వాడి తల్లి” అని తీర్పు చెప్పాడు.

28అప్పుడు ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించడంలో రాజు దైవజ్ఞానం పొందిన వాడని గ్రహించి అతనికి భయపడ్డారు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath