1 రాజులు 21
1యెజ్రెయేలులో సమరయ రాజు అహాబు భవనాన్ని ఆనుకుని యెజ్రెయేలు వాడు నాబోతుకు ఒక ద్రాక్షతోట ఉంది.
2అహాబు నాబోతును పిలిపించి “నీ ద్రాక్షతోట నా భవనాన్ని ఆనుకుని ఉంది. కాబట్టి అది నాకివ్వు. దానిలో కూరగాయలు పండించుకుంటాను. దానికి బదులు దాని కంటే మంచి ద్రాక్షతోట నీకిస్తాను. లేకపోతే దాని ఖరీదైనా ఇస్తాను” అన్నాడు.
3అందుకు నాబోతు “నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రం కుదరదు” అన్నాడు.
4నా పిత్రార్జితాన్ని నీకివ్వనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు.
5అప్పుడు అతని భార్య యెజెబెలు వచ్చి “నీవు విచారంగా భోజనం చేయకుండా ఉన్నావేంటి?” అని అడిగింది.
6అతడు ఆమెతో ఇలా అన్నాడు. “నీ ద్రాక్షతోటను నాకు అమ్ము. లేకపోతే దానికి బదులు మరొక ద్రాక్షతోట నీకిస్తానని యెజ్రెయేలు వాడైన నాబోతును అడిగాను. అతడు నా ద్రాక్షతోట నీకివ్వను అన్నాడు.”
7అందుకు యెజెబెలు “నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి. మనస్సులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను” అంది.
8ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకూ ఇంకా ముఖ్యమైన వారికీ పంపింది.
9ఆ ఉత్తరాల్లో ఇలా రాయించింది. “ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టండి.
10నీవు దేవుణ్ణి, రాజునూ దూషించావు, అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి. తీర్పు అయిన తరువాత అతన్ని బయటికి తీసికెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి.”
11అతని నగర పెద్దలూ పట్టణంలో నివసించే ముఖ్యమైన వారూ యెజెబెలు తమకు పంపిన ఉత్తరాల్లో ఉన్నట్టుగా జరిగించారు.
12ఉపవాస దినం చాటించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టారు.
13అప్పుడు ఇద్దరు నిజాయితీ లేని మనుషులు వచ్చి అతని ఎదుట కూర్చుని “నాబోతు దేవుణ్ణీ రాజునూ దూషించాడు” అని ప్రజల ఎదుట నాబోతు మీద సాక్ష్యం చెప్పారు. వాళ్ళు పట్టణం బయటికి అతన్ని తీసికెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు.
14నాబోతు రాతి దెబ్బలతో చచ్చిపోయాడని వాళ్ళు యెజెబెలుకు కబురు పంపారు.
15అది విని యెజెబెలు “నాబోతు బతికి లేడు, చచ్చిపోయాడు. కాబట్టి నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ఖరీదుకు నీకివ్వనన్న అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో” అని అహాబుతో చెప్పింది.
16నాబోతు చనిపోయాడని అహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకోడానికి వెళ్ళాడు.
17అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలీయాతో ఇలా చెప్పాడు,
18“నీవు లేచి సమరయలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును కలుసుకోడానికి బయలు దేరు. అతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్ళాడు.
19నీవు అతనితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా! యెహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలం లో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలం లోనే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి.”
20అది విని అహాబు ఏలీయాతో “నా పగవాడా, నేను నీకు దొరికానా?” అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు. “యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి నీవు నాకు దొరికావు.
21యెహోవా నీతో ఇలా చెబుతున్నాడు, నేను నీ మీదికి కీడు రప్పిస్తాను. నీ వంశం వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు వారిలో బానిస గానీ స్వతంత్రుడు గానీ అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను.
22ఇశ్రాయేలువారు పాపం చేయడానికి నీవు కారకుడివై నాకు కోపం పుట్టించావు. కాబట్టి నెబాతు కొడుకు యరొబాము కుటుంబానికీ అహీయా కొడుకు బయెషా కుటుంబానికీ నేను చేసినట్లు నీ కుటుంబానికీ చేస్తాను.
23యెజెబెలు గురించి యెహోవా చెప్పేదేమిటంటే యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలును పీక్కుతింటాయి.
24పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి. పొలంలో చనిపోయేవారిని రాబందులు తింటాయి” అన్నాడు.
25తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబులాంటి వాడు ఎవ్వడూ లేడు.
26ఇశ్రాయేలీయుల దగ్గరనుంచి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయులు చేసినట్టు, అతడు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించాడు.
27అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు.
28యెహోవా తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు.
29“అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath