క్రైస్తవం
వెనక్కి

1 రాజులు 16

1యెహోవా బయెషాను గురించి హనానీ కొడుకు యెహూతో ఇలా చెప్పాడు,

2“నేను నిన్ను మట్టిలోనుండి తీసి హెచ్చించి ఇశ్రాయేలు అనే నా ప్రజల మీద నిన్ను అధికారిగా చేశాను, అయినా సరే, యరొబాము ప్రవర్తించినట్టు నీవు ప్రవర్తిస్తూ ఇశ్రాయేలు వారైన నా ప్రజలు పాపం చేయడానికి కారణమై, వారి పాపాలతో నాకు కోపం పుట్టించావు.

3కాబట్టి బయెషా వంశాన్నీ అతని కుటుంబీకులనూ నేను పూర్తిగా నాశనం చేసి, నెబాతు కొడుకు యరొబాము వంశానికి చేసినట్టు నీ వంశానికీ చేయబోతున్నాను.

4పట్టణంలో చనిపోయే బయెషా సంబంధికులను కుక్కలు తింటాయి. పొలాల్లో చనిపోయే వారిని రాబందులు తింటాయి” అన్నాడు.

5బయెషా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటిని గురించి, అతని బలప్రభావాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

6బయెషా చనిపోయినప్పుడు తన పూర్వీకులతోపాటు అతన్ని తిర్సాలో సమాధి చేశారు. అతనికి బదులు అతని కొడుకు ఏలా రాజయ్యాడు.

7యరొబాము వంశం వారిలాగే బయెషా తన పనులతో యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి ఆయనకు కోపం పుట్టించాడు. దానంతటిని బట్టి, యరొబాము కుటుంబాన్నంతా చంపినందుకూ అతనికీ అతని వంశం వారికీ వ్యతిరేకంగా యెహోవా, హనానీ కొడుకు ప్రవక్త అయిన యెహూ ద్వారా తన వాక్కు వినిపించాడు.

8యూదారాజు ఆసా పాలన 26 వ ఏట బయెషా కొడుకు ఏలా ఇశ్రాయేలు వారందరినీ పరిపాలించడం మొదలుపెట్టాడు. అతడు తిర్సాలో రెండేళ్ళు పాలించాడు.

9తిర్సాలో తన కార్యనిర్వాహకుడు అర్సా ఇంట్లో అతడు తాగి మత్తులో ఉన్నప్పుడు యుద్ధ రథాల సగభాగం మీద అధికారి జిమ్రీ అతని మీద కుట్ర పన్ని లోపలికి వెళ్లి

10అతన్ని కొట్టి చంపి, అతనికి బదులు రాజయ్యాడు. ఇది యూదారాజు ఆసా పాలనలో 27 వ ఏట జరిగింది.

11జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలు పెట్టగానే బయెషా వంశం వారందరినీ చంపేశాడు. అతని బంధువుల్లో స్నేహితుల్లో మగవారినందరినీ చంపాడు. ఎవరినీ వదిలిపెట్టలేదు.

12బయెషా, అతని కొడుకు ఏలా, తామే పాపం చేసి, ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యారు. ఆ పాపాల వల్లా తాము పెట్టుకున్న విగ్రహాలవల్లా ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించారు.

13వారు చేసిన పాపాలను బట్టి ప్రవక్త యెహూ ద్వారా బయెషాను గురించి యెహోవా చెప్పిన మాట నెరవేరేలా, బయెషా వంశం వారందరినీ జిమ్రీ నాశనం చేశాడు.

14ఏలా గురించిన మిగతా విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

15జిమ్రీ యూదారాజు ఆసా పాలన 27 వ ఏట తిర్సాలో 7 రోజులు పాలించాడు. అంతలో ప్రజలు ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును చుట్టుముట్టారు.

16జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించాడనే సమాచారం అక్కడ శిబిరంలో తెలిసింది. కాబట్టి శిబిరంలో ఇశ్రాయేలు వారంతా ఆ రోజు సైన్యాధిపతియైన ఒమ్రీని ఇశ్రాయేలుకు రాజుగా పట్టాభిషేకం చేశారు.

17ఒమ్రీ, అతనితోబాటు ఇశ్రాయేలు వారంతా గిబ్బెతోను విడిచిపెట్టి తిర్సా వచ్చి దాన్ని ముట్టడించారు.

18పట్టణం పట్టుబడిందని జిమ్రీ తెలుసుకుని, రాజభవనంలోకి వెళ్లి తనతోపాటు రాజభవనాన్ని తగలబెట్టి చనిపోయాడు.

19ఇతడు కూడా యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. యరొబాము చేసినట్టు పాపం చేస్తూ ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమైనందుకు ఇలా జరిగింది.

20జిమ్రీ గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన రాజద్రోహం గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

21అప్పుడు ఇశ్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయారు. గీనతు కొడుకు తిబ్నీని రాజుగా చేయాలని ప్రజల్లో సగం మంది అతని వైపు, సగం మంది ఒమ్రీ వైపు చేరారు.

22ఒమ్రీ వైపున్న వారు గీనతు కొడుకు తిబ్నీ వైపున్న వారిని ఓడించి తిబ్నీని చంపేశారు. ఒమ్రీ రాజయ్యాడు.

23యూదా రాజు ఆసా పాలన 31 వ ఏట ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై పన్నెండేళ్ళు పాలించాడు. అందులో ఆరేళ్ళు తిర్సాలో పాలించాడు.

24అతడు షెమెరు దగ్గర షోమ్రోను కొండను దగ్గరగా 70 కిలోల వెండిని కొనుక్కుని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టించి, ఆ కొండ యజమాని అయిన షెమెరు అనే వాని పేరును బట్టి తాను కట్టించిన పట్టణానికి షోమ్రోను అనే పేరు పెట్టాడు.

25ఒమ్రీ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. ఇతడు తన పూర్వికులందరికంటే దుర్మార్గుడు.

26అతడు నెబాతు కొడుకు యరొబాము ఏ విధంగా ఇశ్రాయేలువారు పాపం చేయడానికి కారణమై విగ్రహాలను పెట్టుకుని, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించాడో దానినే అనుసరించి ప్రవర్తించాడు.

27ఒమ్రీ గురించిన మిగతా విషయాల గురించి, అతడు చూపించిన బలపరాక్రమాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

28ఒమ్రీ చనిపోయినప్పుడు షోమ్రోనులో తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతని కొడుకు అహాబు అతనికి బదులు రాజయ్యాడు.

29యూదారాజు ఆసా పాలన 38 వ ఏట ఒమ్రీ కొడుకు అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 ఏళ్ళు పాలించాడు.

30ఒమ్రీ కొడుకు అహాబు తన పూర్వికులందరికంటే ఎక్కువగా యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు.

31నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలు చేయడం అతడికి స్వల్పవిషయం అనిపించింది. అతడు సీదోనీయుల రాజు ఎత్బయలు కూతురు యెజెబెలును పెళ్లి చేసుకుని బయలు దేవుణ్ణి పూజిస్తూ వాడికి మొక్కుతూ ఉండేవాడు.

32షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరంలో బయలుకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు.

33అహాబు అషేరా దేవతాస్తంభాన్ని నిలిపాడు. ఈ విధంగా అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం పుట్టించాడు.

34అతని రోజుల్లో బేతేలువాడైన హీయేలు యెరికో పట్టణాన్ని కట్టించాడు. అతడు దానికి పునాది వేసినప్పుడు అబీరాము అనే అతని పెద్దకొడుకు చనిపోయాడు. దానికి గుమ్మాలు నిలిపినప్పుడు సెగూబు అనే అతని చిన్నకొడుకు చనిపోయాడు. ఈ విధంగా నూను కొడుకు యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath