క్రైస్తవం
వెనక్కి

1 రాజులు 15

1నెబాతు కొడుకు యరొబాము రాజు పరిపాలన 18 వ సంవత్సరంలో అబీయా యూదాను పాలించడం మొదలెట్టాడు.

2అతడు యెరూషలేములో మూడేళ్ళు రాజుగా ఉన్నాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కూతురు.

3అతడు గతంలో తన తండ్రి చేసిన దుర్మార్గాలన్నిటినీ చేశాడు. తన పూర్వీకుడైన దావీదు హృదయం తన దేవుడు యెహోవా పట్ల యథార్ధంగా ఉన్నట్టుగా అతని హృదయం యథార్ధంగా లేదు.

4దావీదు హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తన జీవితమంతా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకొంటూ యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో ఏ విషయంలోనూ తప్పిపోలేదు.

5అందుకే దావీదు కోసం అతని తరువాత అతని సంతానం వాణ్ణి నిలపడానికీ యెరూషలేమును స్థిరపరచడానికీ అతని దేవుడు యెహోవా యెరూషలేములో ఒక దీపంగా అతనిని ఉంచాడు.

6రెహబాము బతికిన రోజులన్నీ అతనికీ యరొబాముకూ యుద్ధం జరుగుతూ ఉండేది.

7అబీయా యరొబాముల మధ్య కూడా యుద్ధం జరుగుతూ ఉండేది. అబీయా గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన వాటన్నిటిని గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

8అబీయా చనిపోగా తన పూర్వీకులతో పాటు దావీదు పట్టణంలో అతన్ని సమాధిచేశారు. అతని కొడుకు ఆసా అతనికి బదులు రాజయ్యాడు.

9ఇశ్రాయేలు రాజు యరొబాము పాలన 25 వ సంవత్సరంలో ఆసా యూదా వారిని పరిపాలించడం మొదలెట్టాడు.

10అతడు 40 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబీషాలోము కూతురు.

11ఆసా తన పూర్వీకుడైన దావీదులాగా యెహోవా దృష్టికి యథార్ధంగా నడుచుకుని

12మగ వ్యభిచారులను దేశంలోనుండి వెళ్లగొట్టి తన పూర్వీకులు చేయించిన విగ్రహాలన్నిటినీ పడగొట్టాడు.

13తన అవ్వ మయకా అసహ్యమైన ఒక అషేరా దేవతా స్తంభాన్ని చేయిస్తే ఆసా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి, కిద్రోను లోయ పక్కన దాన్ని కాల్చివేశాడు. పట్టపు రాణి పదవి నుండి ఆమెను తొలగించాడు.

14ఆసా తన జీవితమంతా హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు గాని ఉన్నత స్థలాలను తీసి వేయలేదు.

15అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ వెండి బంగారాన్నీ యెహోవా మందిరంలోకి తెప్పించాడు.

16ఆసాకు, ఇశ్రాయేలు రాజు బయెషాకు వారు బతికిన రోజులన్నీ యుద్ధం జరుగుతూ ఉండేది.

17ఇశ్రాయేలు రాజు బయెషా యూదా వారికి విరోధిగా ఉండి, యూదా రాజు ఆసా దగ్గరనుండి ఎవరూ రాకుండా అతని దగ్గరికి ఎవరూ పోకుండా రమా పట్టణాన్ని కట్టించాడు.

18కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజభవనపు ఖజానాలోనూ మిగిలిన వెండి బంగారమంతా తీసి తన సేవకులకు ఇచ్చి, దమస్కులో నివసిస్తున్న సిరియా రాజు బెన్హదదుకు పంపించాడు. బెన్హదదు హెజ్యోనుకు పుట్టిన టబ్రిమ్మోను కొడుకు. ఆసా ఇలా మనవి చేశాడు.

19“మీ నాన్నకూ మా నాన్నకూ ఒప్పందం ఉన్నట్టుగా నీకూ నాకూ ఒప్పందం ఉండాలి. వెండి బంగారాలను నీకు కానుకగా పంపిస్తున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజు బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీకున్న పొత్తు రద్దు చేసుకో.”

20కాబట్టి బెన్హదదు ఆసా రాజు చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపి, ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు ప్రాంతాలనూ నఫ్తాలి దేశాన్నీ కొల్లగొట్టాడు.

21బయెషాకు అది తెలిసి, రమా పట్టణం కట్టడం మాని తిర్సాకు వెళ్లి అక్కడే నివసించాడు.

22అప్పుడు ఆసా రాజు ఎవరినీ మినహాయించకుండా యూదా దేశం వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి బయెషా కట్టిస్తున్న రమా పట్టణం రాళ్లనూ కర్రలనూ ప్రజలు తీసుకొచ్చేశారు. ఆసా రాజు వాటిని బెన్యామీను ప్రాంతంలో గెబ, మిస్పా కట్టించడానికి ఉపయోగించాడు.

23ఆసా గురించిన మిగతా విషయాలు, అతని బలప్రభావాలూ అతడు చేసినదంతా అతడు కట్టించిన పట్టణాలను గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి వుంది. ముసలితనంలో అతని పాదాలకు జబ్బు చేసింది.

24అప్పుడు ఆసా చనిపోయాడు. అతనిని దావీదు పట్టణంలో తన పూర్వీకుల సమాధిలో పాతిపెట్టారు. అతనికి బదులు అతని కొడుకు యెహోషాపాతు రాజయ్యాడు.

25యూదారాజు ఆసా పరిపాలన రెండో ఏట యరొబాము కొడుకు నాదాబు పరిపాలించడం మొదలుపెట్టి ఇశ్రాయేలు వారిని రెండేళ్ళు పాలించాడు.

26అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన దారిలో నడిచి, తన తండ్రి దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో ఆ పాపాన్ని అనుసరించి ప్రవర్తించాడు.

27ఇశ్శాఖారు గోత్రీకుడూ అహీయా కొడుకు బయెషా నాదాబుపై కుట్ర చేశాడు. నాదాబు, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తూ ఉన్న సమయంలో గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపాడు.

28రాజైన ఆసా పాలన మూడో ఏట బయెషా అతన్ని చంపి అతనికి బదులు రాజయ్యాడు.

29తాను రాజు కాగానే అతడు యరొబాము వంశం వారందరినీ చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఎవర్నీ వదిలి పెట్టకుండా అందరినీ చంపేశాడు. తన సేవకుడు షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా చెప్పినట్టు ఇది జరిగింది.

30యరొబాము చేసిన పాపాలను బట్టి, ఇశ్రాయేలువారు పాపం చేయడానికి అతడు కారణమైనందుకు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు కోపం రేపినందుకు ఇలా జరిగింది.

31నాదాబు గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

32వారు బతికినంత కాలం, ఆసాకూ ఇశ్రాయేలు రాజు బయెషాకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది.

33యూదారాజు ఆసా పాలన మూడో ఏట అహీయా కొడుకు బయెషా తిర్సా పట్టణంలో ఇశ్రాయేలు వారందరినీ పాలించడం మొదలుపెట్టి 24 ఏళ్ళు పాలించాడు.

34ఇతడు కూడాయెహోవా దృష్టికి చెడుగా నడుచుకుని యరొబాము ఎలా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణమయ్యాడో దానంతటినీ అనుసరించి ప్రవర్తించాడు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath