క్రైస్తవం
వెనక్కి

1 రాజులు 10

1షేబదేశపు రాణి యెహోవా పేరును గురించీ సొలొమోను కీర్తిని గురించీ విని, కఠినమైన చిక్కు ప్రశ్నలతో అతణ్ణి పరీక్షించడానికి వచ్చింది.

2ఆమె గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. సొలొమోనును కలిసి అతనితో తన మనసులో ఉన్న సంగతులన్నిటిని గురించి మాటలాడింది.

3ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికి సొలొమోను జవాబు చెప్పాడు. రాజుకు తెలియని సంగతి ఏదీ లేదు కాబట్టి అతడు ఆమె అనుమానాలన్నిటినీ నివృత్తి చేశాడు.

4షేబ రాణి సొలొమోను జ్ఞానాన్ని, అతడు కట్టించిన మందిరాన్ని,

5అతని భోజనం బల్ల మీద ఉన్న పదార్థాలను, అతని సేవకులు కూర్చునే ఆసనాలను అతని పరిచారకులు కనిపెట్టి చూసే విధానం, వారి వస్త్రాలను, అతనికి రస పాత్రలను అందించేవారిని, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహనబలులను చూసింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యం ఇంతింత కాదు.

6ఆమె రాజుతో ఇలా అంది. “నీవు చేసిన పనుల గురించీ నీ జ్ఞానం గురించీ నా దేశంలో నేను విన్న మాట నిజమే.

7కానీ నేను వచ్చి నా కళ్ళారా చూడకముందు ఆ మాటలు నమ్మలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా ఉన్నదానిలో వారు సగం కూడా నాకు చెప్పలేదని నేను గ్రహించాను. నీ జ్ఞానం, నీ ఐశ్వర్యం నేను విన్నదానికంటే ఎంతో అధికంగా ఉన్నాయి.

8నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు! నీ ఎదుట ఎప్పుడూ నిలబడి నీ జ్ఞానవాక్కులు వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్య జీవులు!

9నీలో ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడు యెహోవాకు స్తుతి కలుగు గాక. ఇశ్రాయేలీయులపై యెహోవా ప్రేమ శాశ్వతం కాబట్టి నీతి న్యాయాలకు కట్టుబడి రాచకార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను నియమించాడు.”

10షేబ దేశపు రాణి సొలొమోనుకు సుమారు నాలుగున్నర వేల బంగారం, బహు విస్తారమైన సుగంధ ద్రవ్యాలు, రత్నాలు ఇచ్చింది. రాజైన సొలొమోనుకు ఆమె ఇచ్చినంత విస్తారమైన సుగంధ ద్రవ్యాలు ఇంకెప్పుడూ రాలేదు.

11ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు అక్కడి నుండి గంధం చెక్క, రత్నాలు, ఎంతో విస్తారంగా తెచ్చాయి.

12ఈ గంధపు చెక్కతో రాజు యెహోవా మందిరానికి, రాజగృహానికి స్తంభాలూ, గాయకులకు సితారాలూ స్వరమండలాలూ చేయించాడు. ఇప్పుడు అలాంటి గంధం చెక్క దొరకదు. ఎక్కడా కనిపించదు కూడా.

13సొలొమోను తన వైభవానికి తగిన విధంగా షేబ దేశపు రాణికిచ్చింది కాకుండా, దానికి మించి ఆమె కోరిన వాటన్నిటినీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఆమె తన పరివారంతో కలిసి తన దేశానికి తిరిగి వెళ్ళింది.

14సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 టన్నులు.

15ఇది గాక, వర్తకులూ, అరబి రాజులూ, దేశాధికారులూ అతనికి సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని పెద్ద మొత్తంలో పంపేవారు.

16సొలొమోను రాజు బంగారాన్ని సుత్తెలతో రేకులుగా సాగగొట్టించి దానితో 200 పెద్ద డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలు మూడున్నర కిలోల బంగారంతో చేశారు.

17రేకులుగా కొట్టిన బంగారంతో అతడు 300 చిన్న డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు దగ్గరగా రొండు కిలోల బంగారం వాడారు. రాజు వీటిని లెబానోను అరణ్య రాజగృహంలో ఉంచాడు.

18రాజు ఒక పెద్ద దంతపు సింహాసనం చేయించి దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు.

19ఈ సింహానానికి 6 మెట్లున్నాయి. సింహాసనం పైభాగం వెనక వైపు గుండ్రంగా ఉంది. ఆసనానికి ఇరుపక్కలా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర రెండు సింహాలు నిలిచి ఉన్నాయి.

20ఆరు మెట్లకూ రెండు వైపులా పన్నెండు సింహాలు నిలిచి ఉన్నాయి. అలాటి సింహాసనాన్ని మరే రాజ్యంలో ఎవరూ చేసి ఉండలేదు.

21సొలొమోను రాజు పానపాత్రలు బంగారపువి. లెబానోను అరణ్య మందిరంలోని పాత్రలు అన్నీ బంగారంతో చేసినవే. వెండిది ఒక్కటి కూడా లేదు. సొలొమోను రోజుల్లో వెండికి విలువ లేదు.

22సముద్ర ప్రయాణానికి రాజుకు హీరాము ఓడలతోబాటు తర్షీషు ఓడలు కూడా ఉన్నాయి. ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు తీసుకు వస్తుండేవి.

23ఈ విధంగా సొలొమోను రాజు ఐశ్వర్యం, జ్ఞానం విషయాల్లో భూరాజులందరినీ అధిగమించాడు.

24అతని హృదయంలో దేవుడు ఉంచిన జ్ఞానపు మాటలను వినడానికి లోకప్రజలంతా అతని చెంతకు రావాలని ఆశించారు.

25అతనిని కలిసిన ప్రతి వ్యక్తీ కానుకగా వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు, ప్రతి సంవత్సరం తెచ్చేవాడు.

26సొలొమోను రథాలను రౌతులను సమకూర్చుకున్నాడు. అతనికి 1, 400 రథాలు ఉన్నాయి. 12,000 గుర్రపురౌతులు ఉన్నారు. అతడు వీటిని రథాల కోసం ఏర్పాటు చేసిన పట్టణాల్లోఉంచాడు. కొన్నింటిని యెరూషలేములో రాజు దగ్గర ఉంచాడు.

27రాజు యెరూషలేములో వెండిని రాళ్లతో సమానంగా పరిగణించాడు. దేవదారు మానులను షెఫేలా ప్రదేశంలో ఉన్న మేడి చెట్లంత విరివిగా ఉండేలా చేశాడు.

28ఐగుప్తు నుండి, కిలికియ నుండి తెచ్చిన గుర్రాలు సొలొమోనుకు ఉన్నాయి. రాజు వాణిజ్యాధికారులు గుర్రాల మందలను కొని తెప్పించారు. ఒక్కొక్క మందకు తగిన ధర చెల్లించారు.

29వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన ఒక్కొక్క రథానికి 6 కిలోల వెండి, ఒక్కొక్క గుర్రానికి ఒకటిన్నర కిలోల వెండి చెల్లించారు. వాటిలో ఎక్కువ భాగం హిత్తీయుల రాజులందరికీ అరాము రాజులకూ తగిన ధరకు అమ్మారు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath