కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 7
1ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి.
2అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.
3భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి.
4భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు.
5ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.
6ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు.
7ఏది ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు.
8నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను.
9అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది.
10ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు.
11ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.
12మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు.
13అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు.
14అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే.
15అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు.
16మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?
17అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను.
18ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు.
19దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు,
20ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి.
21దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది.
22ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస.
23ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు.
24సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.
25పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు గానీ ప్రభువు కృప చేత నమ్మదగిన వాడుగా ఉన్న నేను నా భావం చెబుతున్నాను.
26కాబట్టి ఇప్పుడున్న కష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండడం మేలని నా ఉద్దేశం.
27వివాహ వ్యవస్థలో భార్యకు కట్టుబడి ఉన్నావా? వేరు కావాలనుకోవద్దు. భార్య లేకుండా స్వేచ్ఛగా, లేక అవివాహితుడుగా ఉన్నావా? భార్య కావాలని కోరవద్దు.
28ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అవివాహిత పెళ్ళి చేసుకున్నా ఆమె పాపమేమీ చేసినట్టు కాదు. అయితే అలాటి వారికి దైనందిన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.
29సోదరులారా, నేను చెప్పేదేమంటే, సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి.
30ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి. కొనేవారు తాము కొన్నది తమది కానట్టు ఉండాలి.
31ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది.
32మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు.
33పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు.
34అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది.
35మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.
36ఒకడు తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. అతడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు. అది పాపం కాదు.
37అయితే ఎవరైనా పెళ్ళి చేసుకోనని హృదయంలో నిశ్చయించుకుని, దానికి తగిన మనోబలం ఉండి, తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడయితే అతడు చేసేది మంచి పని.
38కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
39భార్య తన భర్త బతికి ఉన్నంత వరకూ అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి.
40అయితే ఆమె ఉన్న రీతిగా ఉండిపోతే మరింత శ్రేష్ఠమని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా నమ్మకం.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath