1 దినవృత్తాంతాలు 17
1దావీదు తన ఇంటికి వెళ్లి సేదదీరిన తరువాత ప్రవక్త అయిన నాతానును పిలిపించి అతనితో “నేను దేవదారుకలపతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను. కాని, యెహోవా నిబంధన మందసం మాత్రం ఒక గుడారంలో ఉంది” అని చెప్పాడు.
2అప్పుడు నాతాను “దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నదంతా చెయ్యి” అని దావీదుతో అన్నాడు.
3ఆ రాత్రి దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు,
4“నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు. యెహోవా చెప్పేదేమంటే, నా నివాసం కోసం ఒక ఆలయాన్ని నువ్వు కట్టించకూడదు.
5ఇశ్రాయేలీయులను రప్పించిన రోజు నుంచి ఈ రోజు వరకూ నేను ఒక ఇంట్లో నివాసం చెయ్యకుండా, డేరాలో, ప్రత్యక్ష గుడారంలో నివాసం చేశాను.
6నేను ఇశ్రాయేలీయులందరి మధ్యలో సంచారం చేసిన కాలంలో, మీరు నాకోసం దేవదారు మానులతో ఆలయం ఎందుకు కట్టలేదు? అని నా ప్రజలను కాయడానికి నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా నేను ఒక్క మాటైనా అన్నానా?
7కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఏం చెప్పాలంటే, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, గొర్రెల వెంట తిరుగుతున్న నిన్ను గొర్రెల మంద నుంచి తీసుకు, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా చేశాను.
8నువ్వు వెళ్లిన ప్రతిచోటా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవాళ్ళను నీ ముందు నిలవకుండా నిర్మూలం చేశాను. లోకంలో ఘనులకు ఉన్న పేరులాంటి పేరు నీకు ఉండేలా చేస్తాను.
9ఇంకా నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం ఒక స్థలం ఏర్పాటు చేసి, వాళ్ళను అక్కడ నాటుతాను. వాళ్ళు ఇంక తిరుగులాడకుండా తమ స్థానంలో కాపురం ఉంటారు. పూర్వం జరిగినట్టూ, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకుని జరుగుతూ వచ్చినట్టూ, దుష్టులు వాళ్ళను ఇక బాధ పెట్టరు.
10నీ పగవాళ్ళందరినీ నేను అణచివేస్తాను. అంతమాత్రమే కాదు, యెహోవానైన నేను నీ తరువాత నీ సంతానమే పరిపాలిస్తుందని నీకు తెలియజేశాను.
11నీ జీవితకాలం ముగిసి నీ పూర్వీకుల దగ్గరికి నువ్వు చేరే సమయానికి, నీ తరువాత నీ కొడుకుల వల్ల కలిగే నీ సంతానాన్ని లేపుతాను. వాళ్ళల్లో ఒకరి ద్వారా నేను రాజ్య స్థాపనచేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.
12అతడు నాకు ఒక మందిరం కట్టిస్తాడు. అతని సింహాసనాన్ని నేను శాశ్వతమైనదిగా చేస్తాను.
13నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నీ మీద పరిపాలించిన సౌలు దగ్గరనుండి తీసి వేసినట్టుగా అతని దగ్గరనుండి నా నిబంధన విశ్వాస్యత తీసివేయను.
14నా మందిరంలో, నా రాజ్యంలో, నేను నిత్యం అతన్ని స్థిరపరుస్తాను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరంగా ఉంటుంది అని అతనికి తెలియచెయ్యి.”
15నాతాను తనకు ప్రత్యక్షం అయిన యీ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేశాడు.
16రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని ఈ విధంగా మనవి చేశాడు. “దేవా యెహోవా, నువ్వు నన్ను ఇలాటి ఉన్నత స్థితికి తేవడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఏమాత్రం?
17దేవా, ఇది నీ దృష్టిలో చిన్న విషయమే. దేవా యెహోవా, నువ్వు దూర భవిషత్తులో ఉండబోయే నీ సేవకుని సంతతినిగూర్చి చెప్పి, ముందు తరాలను నాకు చూపించావు.
18నీ దాసుడైన నాకు కలుగబోయే ఘనతను గూర్చి దావీదు అనే నీ దాసుడనైన నేను నీతో ఇంకా ఏమని మనవి చెయ్యను? నువ్వు నీ దాసునికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చావు.
19యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారం ఈ మహా ఘనత కలుగుతుందని నువ్వు తెలియచేశావు. అతని నిమిత్తమే నువ్వు ఈ గొప్ప కార్యం చేశావు.
20యెహోవా, మేము మా చెవులతో విన్నదంతా నిజం. నీలాంటివాడు ఎవ్వడూ లేడు. నువ్వు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు.
21నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాంటి జాతి భూలోకంలో ఏది? ఐగుప్తులోనుంచి నువ్వు విమోచించిన నీ ప్రజల ముందు నిలబడనివ్వకుండా నువ్వు అనేక జాతులను తోలివేసినందువల్ల మహా భీకరమైన పేరు తెచ్చుకొన్నావు. వాళ్ళు నీ సొంత ప్రజలయ్యేలా వాళ్ళను విమోచించడానికి దేవుడవైన నువ్వు బయలుదేరావు.
22నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నిత్యం నీకు ప్రజలయ్యేలా నువ్వు ఆ విధంగా చేశావు. యెహోవావైన నువ్వు వాళ్లకు దేవుడివయ్యావు.
23యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చీ, అతని సంతతిని గూర్చీ నువ్వు చెప్పిన మాట నిత్యం స్థిరమౌతుంది గాక.
24ఇశ్రాయేలీయుల దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరుకు ఎన్నటికీ ఘనత వచ్చేలా నువ్వు చెప్పిన మాట నిశ్చయంగా స్థిరమౌతుంది గాక. ఇంకా, నీ దాసుడైన దావీదు సంతతి నీ సన్నిధిలో స్థిరపడు గాక.
25దేవా, నీకు సంతానం ఇస్తానని నీ దాసునికి నువ్వు తెలియచేశావు గనుక నీ సన్నిధిలో విన్నపం చెయ్యడానికి నీ దాసునికి ధైర్యం కలిగింది.
26యెహోవా, నువ్వు దేవుడవై ఉండి, నీ దాసునికి ఈ మేలు దయచేస్తానని చెప్పావు.
27ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యం నీ సన్నిధిలో ఉండేలా దాన్ని ఆశీర్వదించడానికి నీకు ఇష్టం అయింది. యెహోవా, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath