క్రైస్తవం
వెనక్కి

1 దినవృత్తాంతాలు 11

1ఇదంతా అయ్యాక ఇశ్రాయేలు ప్రజలందరూ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. “ఇలా చూడు, మేము నీకు రక్తమాంసాల్లాంటి వాళ్ళం. నీ సొంత బంధువులం.

2ఇటీవల సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలు సైన్యాలను నడిపిస్తూ ఉన్నావు. నీ దేవుడైన యెహోవా నీతో ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు. వారిమీద అధిపతిగా ఉండి పరిపాలన చేస్తావు’ అని చెప్పాడు కదా” అని దావీదుతో అన్నారు.

3ఇలా ఇశ్రాయేలు ప్రజల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. వారంతా కలసి ఇశ్రాయేలు ప్రజలందరి పై రాజుగా దావీదుకి అభిషేకం చేశారు. ఈ విధంగా సమూయేలు ప్రకటించిన యెహోవా మాట నెరవేరింది.

4ఆ తరువాత దావీదూ, ఇశ్రాయేలు ప్రజలంతా యెరూషలేము అనే పేరున్న యెబూసుకి వెళ్ళారు. అప్పటికి ఆ దేశంలో స్థానికులైన యెబూసీయులు నివసిస్తున్నారు.

5యెబూసులో నివసించే స్థానికులు దావీదుతో “నువ్వు ఇక్కడికి రాలేవు” అన్నారు. కాని దావీదు అక్కడి సీయోను కోటని ఆక్రమించాడు. ఈ సీయోనునే “దావీదు పట్టణం” అంటారు.

6దానికి ముందు దావీదు “ఎవరు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో అతడే సైన్యాధిపతి అవుతాడు” అని ప్రకటించాడు. దాంతో సెరూయా కొడుకైన యోవాబు అందరి కన్నా ముందుగా వారిపై దాడి చేశాడు. కాబట్టి యోవాబునే సైన్యాధిపతిగా నియమించారు.

7తరువాత దావీదు ఆ కోటలోనే నివసించాడు. కాబట్టి దానికి “దావీదు పట్టణం” అనే పేరు కలిగింది.

8దావీదు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. మిల్లో నుండి ప్రాకారం వరకూ పటిష్ట పరిచాడు. పట్టణంలో మిగిలిన ప్రాంతాలను యోవాబు పటిష్టపరిచాడు.

9దావీదు అంతకంతకూ ఘనత పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.

10ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహోవా మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలందరితో కలసి దావీదుని రాజుగా చేసినవాళ్ళూ, దావీదుతో కూడా శూరులుగా, బలవంతులుగా నిలిచిన వాళ్ళూ, నాయకులుగా ఉన్నవాళ్ళూ వీళ్ళే.

11దావీదు దగ్గర శ్రేష్ఠులుగా ఉన్న ఆ శూరుల జాబితాలో ముప్ఫై మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఒక హక్మోనీ వాడి కొడుకైన యాషాబాము. ఇతను ఒక యుద్ధంలో కేవలం తన ఈటెతో మూడు వందల మందిని చంపాడు.

12ఇతని తరువాత పేరు అహోహీయుడైన దోదో కొడుకైన ఎలియాజరుది. ఇతడు ముగ్గురు బలవంతులుగా పేరు పొందిన వారిలో ఒకడు.

13ఇతడు పస్దమ్మీములో ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో దావీదుతో కూడా ఉన్నాడు. అక్కడ ఒక బార్లీ చేను ఉంది. మిగిలిన సైన్యం ఫిలిష్తీయులను చూసి పారిపోయారు.

14అయితే వీళ్ళు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిష్తీయులను అడ్డుకుని వారిని హతమార్చారు. యెహోవా వారిని రక్షించి వాళ్లకు గొప్ప విజయం అనుగ్రహించాడు.

15ఆ ముప్ఫై మంది శూరుల్లో ప్రముఖులైన ఈ ముగ్గురూ అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీ సైన్యం రెఫాయీము లోయలో మజిలీ చేశారు.

16ఆ సమయంలో దావీదు తన స్థావరం అయిన గుహలో ఉండగా ఫిలిష్తీ సైన్యం బేత్లెహేములో మకాం చేశారు.

17దావీదు బేత్లెహేము నీటి కోసం ఆశ పడ్డాడు. “బేత్లెహేములోని బావిలో నీళ్ళు నాకెవరు తెస్తారు? ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు నా దాహం తీర్చడానికి నాకెవరు తెస్తారు?” అన్నాడు.

18కాబట్టి ఆ ముగ్గురు బలవంతులూ ఫిలిష్తీ సైన్యంలోకి చొరబడ్డారు. వారి మధ్యలో నుండి వెళ్ళి ఆ ఊరి ద్వారం దగ్గర బావిలోని నీళ్ళు తోడుకుని వాటిని దావీదుకు తెచ్చి ఇచ్చారు. కానీ దావీదు ఆ నీళ్ళు తాగేందుకు నిరాకరించాడు. వాటిని యెహోవాకు అర్పణగా పారబోసాడు.

19తరువాత ఇలా అన్నాడు “నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక. వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన ఈ నీళ్ళు వాళ్ళ రక్తం లాంటిది. దాన్నినేను ఎలా తాగగలను?” అన్నాడు. ఈ ముగ్గురు బలవంతులు ఇలాంటి కార్యాలు చేశారు.

20యోవాబు సోదరుడైన అబీషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు మూడు వందల మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది.

21ముగ్గురిలో ఇతనికి ఎక్కువ గౌరవం, కీర్తీ కలిగాయి. అయితే అతనికి కలిగిన కీర్తి పేరు మోసిన ఆ ముగ్గురు సైనికుల కీర్తికి సాటి కాలేదు.

22ఇంకా కబ్సెయేలు ఊరివాడు యెహోయాదా కొడుకు బెనాయా ఎంతో బలవంతుడు. తన పరాక్రమ కార్యాల వల్ల ఇతడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఇతడు మోయాబు వాడు అరీయేలు కొడుకులిద్దర్నీ చంపాడు. ఇంకా ఇతడు మంచు పడే కాలంలో ఒక బిలంలోకి దిగి అక్కడ ఒక సింహాన్ని చంపివేశాడు.

23ఒకసారి ఇతను ఏడున్నర అడుగుల ఎత్తున్న ఒక ఐగుప్తీయున్నిచంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో సాలెవాడి దండె అంత పెద్ద ఈటె ఉంది. బెనాయా వాడి మీదికి ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ ఈటెను ఐగుప్తీయుడి చేతిలోనుండి లాక్కుని దానితోనే వాణ్ణి చంపివేశాడు.

24ఇలాంటి ఘన కార్యాలు చేసిన యెహోయాదా కొడుకైన బెనాయా పేరు ఆ ముగ్గురు బలవంతుల పేర్లలో చేర్చారు.

25ముప్ఫై మంది సైనికుల్లో అతణ్ణి గొప్పవాడిగా ఎంచారు, కానీ పేరు మోసిన ఆ ముగ్గురు వీరులకు సాటి కాలేదు. కానీ దావీదు ఇతణ్ణి అంగ రక్షకులపై అధిపతిగా నియమించాడు.

26ఆ యోధులు ఎవరంటే యోవాబు తమ్ముడు అశాహేలు, బేత్లెహేము ఊరివాడు దోదో కొడుకైన ఎల్హానాను,

27హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

28తెకోవీయుడైన ఇక్కేషు కొడుకైన ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,

29హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,

30నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కొడుకు హేలెదు,

31బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రీబై కొడుకు ఈతయి, పిరాతోనీయుడు బెనాయా,

32గాయషు లోయకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,

33బహరూమీయుడు అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా,

34గిజోనీయుడైన హాషేము కొడుకులూ, హరారీయుడైన షాగే కొడుకైన యోనాతాను,

35హరారీయుడైన శాకారు కొడుకైన అహీయాము, ఊరు కొడుకు ఎలీపాలు,

36మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,

37కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై,

38నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,

39అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలు మోసేవాడూ బెరోతీయుడూ అయిన నహరై,

40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

41హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు,

42రూబేనీయుడైన షీజా కొడుకూ, రూబేనీయులకు నాయకుడూ అయిన అదీనా, అతని తోటి వారైన ముప్ఫై మందీ,

43మయకా కొడుకైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,

44ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కొడుకులు షామా యెహీయేలు,

45షిమ్రీ కొడుకైన యెదీయవేలు, అతని సోదరుడూ, తిజీయుడూ అయిన యోహా,

46మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కొడుకులైన యెరీబై యోషవ్యా, మోయాబు వాడు ఇత్మా,

47ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా ఊరివాడు యహశీయేలు అనే వాళ్ళు.

మూలం: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath